About MR Prasad

వందగొంతుల

వొక్కమనిషి

ప్రపంచంలో మొట్టమొదటి మిమిక్రీ ట్రయినింగ్ స్కూల్ స్థాపించబోతున్న వ్యక్తి, మిమిక్రీ శిక్షణకు సిలబస్ తయారుచేసిన మొదటి వ్యక్తి యం.ఆర్. ప్రసాద్. ఈయన గుంటూరు వాస్తవ్యులు. ‘శ్రీదేవి పెళ్ళి శ్రీదేవి విడాకులు’, ‘చీఫ్ మినిష్టర్ హిరంజీవి’ వంటి మిమిక్రీ క్యాసెట్లతో తెలుగువారికి సుపరిచితులు. వంద గొంతులు ఈ వొక్క మనిషి అంతరంగంలోకి ప్రవేశించింది.

ఎన్టీఆర్ మాట్లాడితే ప్రసాద్ మాట్లాడినట్టు ఉంటుంది!
వాక్య నిర్మాణం కరక్టే!

మామూలుగా అయితే ప్రసాద్ మాట్లాడితే ఎన్టీఆర్ మాట్లాడినట్టు వుంటుంది అనాలి. కాని ఎన్టీఆర్ మాట ధోరణిని, గొంతులోని హెచ్చు తగ్గుల్ని, ఆయన సొంత వాయిస్ కల్చర్ ని ప్రసాద్ ఎంత చక్కగా పట్టుకున్నాడంటే ఎన్టీఆర్ మాట్లాడితే ప్రసాద్ మాట్లాడినట్టు వుంటుంది. మిమిక్ అంటే ఇతరుల్ని అనుకరించడం అని. ఇతరుల మాటల్నీ, అలవాట్లనీ, ఆకారాన్నీ అనుకరించి హాస్యం సృష్టించే కల మిమిక్రీ. ప్రసాద్ అనుకరణ ఆ స్థాయిని దాటి అసలు వాళ్ళే ప్రసాద్ ను అనుకరిస్తున్నారా అనిపిస్తుంది. అదీ ఎం.ఆర్. ప్రసాద్ ప్రత్యేకత. శ్రీదేవి పెళ్ళి శ్రీదేవి విడాకులు, చీఫ్ మినిష్టర్ చిరంజీవి, ఆనందోబ్రహ్మ, బ్రహ్మర్షి విశ్వామిత్రులు వంటి హ్యూమర్ క్యాసెట్లను మీరు వినే వుంటారు. వాటికి స్వరకల్పన చేసింది ప్రసాదే. సారా నిషేధం, జాతీయ పొదుపు పథకాలు, స్వయం ఉపాధి సంకల్పం, పోలీసులు-ప్రజల మధ్య సంబంధాలు, మన చైతన్యం, గ్రామాల్లో నాటువైద్యం వంటి క్యాసెట్లతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రచార క్యాసెట్లను కూడా ప్రసాద్ స్వరకల్పనతో విడుదలయ్యాయి.

గురువు వింతల వీరారెడ్డి

ఇరవై ఎల్లా నుంచి మిమిక్రీ రంగంలో వున్న ఎం.ఆర్.ప్రసాద్ గుంటూరులో పుట్టారు. వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు, బి.కాం. చదివారు. తండ్రి స్కూల్ టీచర్. అదే స్కూల్లో చదివిన ప్రసాద్ 1969లో ఒకరోజు తమ పాఠశాలలో జరిగిన మిమిక్రీ ప్రదర్శనకు హాజరయ్యారు. ప్రదర్శన ఇచ్చింది వింతల వీరారెడ్డి. ఆ ప్రోగ్రామ్ అతనికి ఎంతో నచ్చింది. ఇంటికెళ్ళి తాను కూడా కొందరు గొంతుల్ని అనుకరించడం మొదలుపెట్టారు. నిజానికి ఆ ప్రోగ్రామ్ బాధ్యతలన్నీ చూసింది ప్రసాద్ తండ్రే. అందుకని మరుసటి రోజు వీరారెడ్డి వారింటికి వచ్చారు. అప్పుడు ప్రసాద్ తన మిమిక్రీ సామర్థ్యాన్ని వీరారెడ్డి ముందు ప్రదర్శించారు. ఆయన ఎంతో మెచ్చుకున్నారు. అంతే ఆ రోజు నుంచి ప్రసాద్ మిమిక్రీ కళకు అంకితమయ్యారు.

ఇప్పటికి మొత్తం 200 మిమిక్రీ క్యాసెట్లు విడుదల చేశారు. గ్రామ గ్రామాన 5060 ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో పదిహేడు సార్లు వివిధ అవార్డులు అందుకున్నారు. ‘పేకాట పాపారావు’ సినిమాలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్., కృష్ణ, చిరంజీవి, రాజశేఖర్ లాగా వేరే వాళ్ళు నటిస్తే అందరికీ ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ‘సుందరవదనా సుబ్బలక్ష్మి మొగుడా’ సినిమాలో ఒక బిట్ లో నటించి ఆర్టీసీ మీద సెటైర్లు పేల్చారు. ఇంకా రిలీజు కాని రెండు, మూడు సినిమాల్లో కొందరు నటులకు డబ్బింగ్ చెప్పారు.

మద్రాసు తెలుగు అకాడమీ వారి 1994 ఉగాది పురస్కార వేడుకల్లో తనదైన పద్ధతిలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చి దర్శకుడు కె. విశ్వనాథ్ ప్రశంసలు అందుకున్నారు. ఈ ప్రదర్శనా కార్యక్రమాన్ని దూరదర్శన్ కూడా ప్రసారం చేసింది. ఎన్టీఆర్ అయితే ‘మిమిక్రీ క్యాసెట్ కింగ్’ అని ప్రసాద్ ని మెచ్చుకున్నారు. 1980 లో ‘బెస్త్ట్ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్’ అవార్డును సినీనటుడు మోహన్ బాబు చేతుల మీదుగా అందుకొన్నారు.

 

 

 

 

Start typing and press Enter to search

Shopping Cart